నరేశ్ లొల్ల.. తెలుగు సీరియల్స్ ద్వారా అందరికి సుపరిచితమే. బిగ్ బాస్ సీజన్-7 లో అమర్ దీప్ కి సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్ అయ్యాడు. అమర్ దీప్ కి ఆప్తుడు అయినటువంటి నరేశ్ లొల్ల తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలని షేర్ చేసుకున్నాడు.
ఈ మధ్య కాలంలో కన్నడ నటీనటులకి డిమాండ్ ఎక్కువ అయింది. కొత్తవాళ్ళని తీసుకోవాలంటే వాళ్ళనే తీసుకుంటున్నారు. మన తెలుగువాళ్ళని తీసుకోవడం లేదంటూ చెప్పుకొచ్చాడు. తెలుగులో ఎంతమంది హీరోలు లేరు.. చాలామంది ఉన్నారు. కానీ పక్క రాష్ట్రాల హీరో, హీరోయిన్లను ప్రమోట్ చేసినంతగా.. మన తెలుగు వాళ్లని ప్రమోట్ చేయడం లేదు టీవీ ఛానల్స్ వాళ్లు. ఒక్కసారి మా తెలుగు వాళ్లని కూడా ప్రమోట్ చేసి చూడండి. రేటింగ్ డబుల్ వస్తుంది. నేను కన్నడ వాళ్లని తక్కువ చేయడం లేదు కానీ.. కనీసం వాళ్లకి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం కూడా రావడం లేదు. తెలుగు భాష రాకపోవడం వల్ల.. ఆ డైలాగ్‌లకు అర్థం తెలియకపోవడం వల్ల.. ఎమోషన్స్ అన్నీ కిల్ అయిపోతున్నాయి. అయినా సరే వాళ్లనే పెడుతున్నారు.
సినిమాల్లో వచ్చే రెమ్యూనరేషన్ వేరు.. సీరియల్స్‌కి వచ్చే రెమ్యూనరేషన్ వేరు. సీరియల్స్‌లో తెలుగు వాళ్ల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే.. ఓ సీనియర్ నటుడు.. రెండు మూడు సీరియల్స్‌లో నటిస్తున్నాడు. ఆయన ఒక్కోసారి ఫోన్ చేసి.. నరేష్ ఓ రెండు వేలు ఉన్నాయా? పేమెంట్ వచ్చాక ఇస్తా అని అడుగుతాడు. అంటే రెమ్యూనరేషన్ ఎంత తక్కువగా ఉన్నాయో మీరే అర్థం చేసుకోవచ్చు. తినడానికి తిండి లేక.. ఫ్యామిలీని పోషించుకోలే ఎంత మంది ఎన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నారో నాకు తెలుసు. మీరు అనుకున్నంత గొప్పగా మాకు పేమెంట్స్ ఇవ్వరు. ఈ సోకాల్డ్ ఇతర రాష్ట్రాల ఆర్టిస్ట్‌లతో పోల్చుకుంటే.. మాకు ఇచ్చే రెమ్యూనరేషన్ వాళ్ల కంటే 50 శాతం తక్కువ ఇస్తారు. పక్క రాష్ట్రాల నటీ నటులకు ఇక్కడ హోటల్స్ రూంలు ఇస్తారు.. ఫ్లైట్ టికెట్స్ పెడతారు.. కారు ఇస్తారు.. ఫుడ్ చార్జీలు కూడా ప్రొడ్యుసర్స్ భరిస్తారు. కానీ తెలుగు ఆర్టిస్ట్‌ల విషయానికి వస్తే.. కారు కన్వినెన్స్ ఇస్తారు.. అసిస్టెంట్ బేటా ఇస్తారు.. ఫుడ్ ప్రొడక్షన్ వాళ్లు పెడతారు. వాళ్లు ఏది పెడితే అది తినాలి. వాళ్లు ఇచ్చింది తీసుకుని వెళ్లాలి. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు క్యాస్ట్యూమ్స్ కూడా ఇవ్వరు. నేను చేసిన సీరియల్స్‌లో ఇప్పటి వరకూ అన్నీ నేను కొనుకున్నవే. హీరో హీరోయిన్లకు క్యాస్ట్యూమ్స్ ఇస్తుంటారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు మాత్రం సొంతంగా భరించాల్సిందే. అవి కూడా వాళ్లకి నచ్చినట్టు ఉండాలి. మనకి నచ్చింది కాదు. నేను అడిగేది ఏంటంటే.. వాళ్లకి ఇచ్చేటంత రెమ్యూనరేషన్ తెలుగు వాళ్లకి ఇవ్వమని అడగడం లేదు. వాళ్లకి ఇచ్చే సదుపాయాలు మాకు కల్పించమని అడగడం లేదు. మాకు వాళ్లకిచ్చేటంత బడ్జెట్ వద్దు.. అవకాశాలు ఇవ్వండి చాలు. వాళ్లకంటే ఖచ్చితంగా బాగా చేస్తాం.. వాళ్లకంటే మంచి ఔట్ పుట్ ఇస్తాం. వాళ్ల కంటే మంచి రేటింగ్ తెస్తాం. వాళ్లకంటే తెలుగు వాళ్లు ఎందులోనూ తక్కువగా అయితే చేయరని నరేశ్ లొల్ల అన్నాడు.
మనం తెలుగు ఇండస్ట్రీలో ఉన్నాం.. ఈ ఇండస్ట్రీని నమ్ముకుని బోలెడంత మంది ఉన్నారు. తిండిలేని వాళ్లు కూడా ఉన్నారు. ఇంతకు ముందు 20-22 పైన రేటింగ్ వచ్చేది. కానీ ఇప్పుడు 4-6 రేటింగ్ వచ్చిందంటే గొప్పగా ఫీల్ అవుతున్నారు. తెలుగు వాళ్లని పెట్టి.. తెలుగు సీరియల్స్ తీయండి.. ఇంతకంటే మంచి రేటింగ్ ఖచ్చితంగా వస్తుందంటూ తమ కష్టాలని నరేశ్ లొల్ల చెప్పుకొచ్చాడు.